: నాకు తెలుగు వచ్చు... మాట్లాడితే మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు: జవదేకర్
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'హరితహారం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "నాకు తెలుగు వచ్చు. అయితే, నేను తెలుగులో మాట్లాడితే మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు" అని చమత్కరించారు. 'జై తెలంగాణ' నినాదంతో ప్రసంగం మొదలుపెట్టిన జవదేకర్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారంటూ సీఎం కేసీఆర్ ను అభినందించారు. దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణను ఆదర్శంగా తీసుకుని 'హరితహారం' కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన సీఎం కేసీఆర్ తో కలిసి మొక్కలు నాటారు.