: ఏపీ ఎంపీలకు పౌరుషం లేదా? సీటు కోసం ఊగిపోయిన కేశినేని నాని ఇప్పుడేం చేస్తున్నారు?: పవన్ కల్యాణ్
సీమాంధ్ర ఎంపీలకు ఆత్మగౌరవం, పౌరుషం లేవా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని... ఎన్నికల సమయంలో టీడీపీ టికెట్ కోసం ఎంతలా ఊగిపోయారో చూశానని.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటులో గోడలు చూస్తూ కాలం గడుపుతున్నారా? అని నిలదీశారు. తెలంగాణ పాలకులకంటే... బాధ్యతలు మరచిన సీమాంధ్ర ఎంపీల గురించే ఏపీ ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పారు. సీమాంధ్రకు రావాల్సిన ప్రయోజనాలు, స్పెషల్ స్టేటస్ కోసం ఎంపీలు ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీశారు. 'రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు చూసుకోవడానికి కాదు ప్రజలు ఓటు వేసింది' అంటూ ఘాటు విమర్శలు చేశారు. కేసుల భయం ఉన్న వారు అసలు రాజకీయాల్లోకే రాకూడదని సూచించారు. అశోక్ గజపతిరాజు సహా సీమాంధ్ర ఎంపీలంతా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఏపీలో బీజేపీకి కూడా ఇద్దరు ఎంపీలున్నారు... వారేమి చేస్తున్నారని నిలదీశారు. ప్రధాని మోదీ ఏమనుకుంటారో అనుకుని మాట్లాడకపోతే ఎలా? అని ప్రశ్నించారు. పోరాడలేని ఎంపీలు సీమాంధ్రులకు అవసరం లేదని అన్నారు. కావూరి, పురంధేశ్వరి వంటి వారు ఇంకా ఏమీ మాట్లాడటం లేదని విస్మయం వ్యక్తం చేశారు.