: సెక్షన్ 8 అమలయ్యేలా చూడండి.. నేడు రాష్ట్రపతిని కలవనున్న ఏపీ మినిస్టర్లు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు మరోమారు చర్చకు రానుంది. నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్న ఏపీ కేబినెట్ మంత్రులు హైదరాబాదులో సెక్షన్ 8 అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కోరనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదును పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటిస్తే, ఏడాది గడవకుండానే తెలంగాణ సర్కారు సీమాంధ్రుల హక్కులను కాలరాస్తోందని ఈ సందర్భంగా ఏపీ మంత్రులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. సాక్షాత్తు తమ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు సెల్ ఫోన్ సహా 120 మందికి చెందిన ఫోన్లను నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ సర్కారు ట్యాప్ చేసిందని కూడా వారు ప్రణబ్ కు తెలపనున్నారు. సెక్షన్ 8 అమలుతోనే హైదరాబాదులో సీమాంధ్రులు నిర్భయంగా జీవనం సాగించగలరని కూడా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలోని మంత్రుల బృందం రాష్ట్రపతికి విన్నవించనుంది.