: మొసలిని ముద్దాడితేనే ఉద్యోగం!... చైనా కంపెనీ షరతుతో యువతుల బెంబేలు
ఉద్యోగం కావాలంటే, ఏం కావాలి? కొత్త కొత్త ఐడియాలతో పాటు అప్పటిదాకా చదువుకున్న చదువునంతా రంగరించి ఉద్యోగమిచ్చిన కంపెనీ వృద్ధికి తోడ్పాటునందించే లక్షణముంటే చాలు. దీనితో పాటు ధైర్య సాహసాలు కూడా ఉంటేనే ఉద్యోగమిస్తామంటోంది చైనా కంపెనీ. ఈ తరహాకు చెందిన ఆ దేశ కంపెనీ ఒకటి ఇటీవల సేల్స్ వుమెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. చైనాలోని గ్యాంగ్ డాంగ్ కు చెందిన ఆ కంపెనీకి మంచిపేరున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలకు భారీ సంఖ్యలో యువతులు తరలివచ్చారు. తెలివితేటలకు సంబంధించి తొలి రౌండ్ దాటిన అమ్మాయిలు రెండో రౌండ్ టెస్ట్ గురించి తెలుసుకుని బెంబేలెత్తిపోయారు. ఇంతకీ ఆ టెస్ట్ ఏమిటంటే... సజీవంగా ఉన్న మొసలి నోటి మీద ముద్దు పెట్టాలట. మొసలి మాంసం, చర్మాలతో తయారు చేసిన ఆరోగ్య ఉత్పత్తులను విక్రయిస్తున్న తాము, సదరు మొసలితో భయం లేకుండా ప్రవర్తించే వాళ్లకే ఉద్యోగాలివ్వాలని నిర్ణయించుకోవడంలో తప్పేముందని కూడా సదరు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ టెస్టులో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన కొంతమంది యువతులు ఊపిరిబిగబట్టి, బతికున్న మొసలిని దాని నోటిపై ముద్దుపెట్టుకున్నారు. ఇలా మొసలిని ముద్దాడిన యువతులకు ఆ కంపెనీ రూ.1,000 నగదు బహుమతితో పాటు వారిని తర్వాతి రౌండ్ కు ఎంపిక చేసిందట.