: 'ఓటుకు నోటు' కేసులో జిమ్మీబాబే కీలకమట... ప్రశ్నల వర్షం కురిపించనున్న ఏసీబీ
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి కారణమైన ఓటుకు నోటు కేసులో టీడీపీ యువజన విభాగం తెలుగు యువత నేత జిమ్మీబాబును కీలక వ్యక్తిగా తెలంగాణ ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కేసులో ఫిర్యాదిదారు, తెలంగాణ నామినేటెడ్ ఎమ్యెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ కు సెబాస్టియన్ ను పరిచయం చేసిన వ్యక్తిగా జిమ్మీబాబు తెరపైకి వచ్చారు. కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో స్టీఫెన్ సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో జిమ్మీబాబును విచారించేందుకు ఏసీబీ అధికారులు సమాయత్తమయ్యారు. మూడు రోజుల క్రితమే జిమ్మీబాబుకు నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు నేడు ఆయనను పలు కోణాల్లో విచారించనున్నారు. కేసు నమోదైన దాదాపు నెల తర్వాత వెలుగులోకి వచ్చిన జిమ్మీబాబుపై నేడు ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయనపై సంధించాల్సిన ప్రశ్నావళిని ఏసీబీ సిద్ధం చేసుకుందట.