: కేసీఆర్ నోట మరోమారు ‘పిచ్చోడి’ మాట!...ఆదిలాబాదు సభలో నిరసనపై ఆగ్రహం


తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఆయన ఎక్కడికెళితే, అక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో నిగ్రహం కోల్పోతున్న కేసీఆర్, తనను ప్రశ్నిస్తున్న రైతులు, ఉద్యమకారులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొన్నటికి మొన్న తనను ప్రశ్నించిన రైతుపై ఆగ్రహంతో రగిలిపోయిన కేసీఆర్, నిన్న ఆదిలాబాదు సభలో వెల్లువెత్తిన నిరసనపై ఎదురుదాడికి దిగారు. పరుష పదజాలంతో ఉద్యమకారుడికి హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకెళితే... నిన్న ఆదిలాబాదు జిల్లా పర్యటనకు వెళ్లిన కేసీఆర్ గూడెం ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో జలసాధన సమితి కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మడిహెట్టి వద్దే నిర్మించాలని డిమాండ్ చేయడంతో పాటు ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలన్న సర్కారు నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్, జలసాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ పై విరుచుకుపడ్డారు. ‘‘ గోవర్ధన్ అనే ఓ పిచ్చోడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నాడు. కనీస పరిజ్ఞానం లేకుండా పత్రికలలో తప్పుడు వ్యాసాలు రాస్తున్నాడు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇలాంటి సన్నాసులు ఎంతమంది వచ్చినా నేను భయపడను. గోవర్ధన్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన నిరసనకారులనుద్దేశించి ‘‘అరుపులు మానండి. లేదంటే మర్యాద ఉండదు. మంచిమాటతో వినకపోతే గుణపాఠం తప్పదు. మీకంటే ఎక్కువ నాకు తెలుసు. జెండాలు చూపేవారికి సంస్కారముందా? బిత్తిరి నినాదాలు ఆపండి. మీకు బుద్ది లేదా? మొదలు జెండాలు దించండి. మీ కథ ఏందో చెబుతా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News