: నేనలా చేయను...దేశం గర్వించేలా చేయడమే లక్ష్యం: మేరీ కోం
ప్రొఫెషనల్ బాక్సర్ గా మారే ఆలోచన లేదని ప్రముఖ మహిళా బాక్సర్, ఒలింపియన్ మేరీ కోం స్పష్టం చేసింది. తాను ప్రొఫెషనల్ బాక్సర్ గా మారానని విజేందర్ సింగ్ ప్రకటించిన అనంతరం పలువురు బాక్సర్ల వ్యవహారశైలిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో భవిష్యత్ లక్ష్యంపై మేరీ కోం వెల్లడించింది. గతంలో ప్రకటించిన విధంగానే రియో ఒలింపిక్స్ తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పింది. రియో ఒలింపిక్స్ లో విజయం సాధించి దేశం గర్వపడేలా చేయడమే తనముందున్న ఏకైక లక్ష్యమని మేరీకోం స్పష్టం చేసింది. రిటైర్మెంట్ తరువాత తన అకాడెమీని చూసుకుంటాను తప్ప ప్రొఫెషనల్ గా మారనని తెలిపింది. విజేందర్ గురించి అడుగగా, అది అతని వ్యక్తిగత నిర్ణయమని, దీనిపై తానేమీ చెప్పలేనని ఆమె స్పష్టం చేసింది. కాగా, దేశం కోసం ఆడుతున్నానని మభ్యపెట్టిన విజేందర్, అత్యుత్తమ శిక్షణ, నిధులు, సౌకర్యాలు పొంది దేశాన్ని మోసం చేశాడని పలువురు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.