: తెలుగు వారంతా ఒక్కటే...ఆంధ్రుల భద్రతకు కట్టుబడి ఉన్నాం: తలసాని
ఏ ప్రాంతానికి చెందిన వారైనా తెలుగు వారంతా ఒక్కటేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమెరికాలోని డెట్రాయిట్ లో జరిగిన తానా 20వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హైదరాబాదులో ఆంధ్రా ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణను ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు వారు ఎక్కడున్నా తమ ప్రత్యేకత చాటుకుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అభివృద్ధిలో యువత పోటీ పడాలని ఆయన ఆకాంక్షించారు.