: డబ్బు కోసం పారిశ్రామికవేత్తను బెదిరించిన కిడ్నాపర్ల అరెస్ట్
పారిశ్రామిక వేత్త నుంచి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసి, చివరికి 20 వేల రూపాయలు తీసుకుంటూ ఇద్దరు కిడ్నాపర్లు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన పెద్దిరెడ్డి సతీష్ (24) అమలాపురానికి చెందిన అడపా సుబ్రమణ్యం (23) జీవనోపాధి నిమిత్తం హైదరాబాదు చేరుకుని బాల్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో, బహుదూర్ పల్లి, దూలపల్లిల్లో పరిశ్రమలు నిర్వహించే ఏడుకొండలును బెదిరించి, డబ్బులు రాబట్టుకునేందుకు వీళ్లిద్దరూ పథకం రచించారు. ఈ క్రమంలో ఏడుకొండలుకు గతనెల 29న మిస్డ్ కాల్ ఇచ్చారు. దీనిని చూసిన ఏడుకొండలు ఆ నెంబర్ కు కాల్ చేయడంతో పది లక్షల రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో 'మీ ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసి అంతం చేస్తా'మని బెదిరించారు. దీంతో ఏడుకొండలు ఇప్పటికిప్పుడు అంతివ్వలేనని, ముందుగా ఓ 20 వేల రూపాయలు ఇచ్చుకుంటానని చెప్పాడు. దానికి వారు అంగీకరించడంతో, వారిని సూరారం రావాలని సూచించాడు. అతని సూచనల ప్రకారం అక్కడికి వెళ్లి, అతని వద్దనుంచి 20వేల రూపాయలు తీసుకున్నారు. తర్వాత ఏడుకొండలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెంబర్ ట్రేస్ చేసిన పోలీసులు, వారిద్దరినీ బాలానగర్ లో అదుపులోకి తీసుకున్నారు.