: ఉత్తరప్రదేశ్ లో ఖైదీలు, జైలు సిబ్బంది మధ్య వివాదం...26 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ లో జైలు సిబ్బంది, విచారణ ఖైదీల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఖైదీ మృతి చెందగా, 26 మందికి గాయాలయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... జౌన్ పూర్ జిల్లా కారాగారంలో యాదవ్ అనే విచారణ ఖైదీ జైలులోని మహిళా గార్డుతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తోటి గార్డులు యాదవ్ ను చితకబాదారు. తీవ్రగాయాలపాలైన యాదవ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై ఆగ్రహించిన ఖైదీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వివాదం ముదరడంతో పరస్పర దాడులకు దిగారు. ఖైదీలపై పోలీసులు, బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు వినియోగించారు. ఈ ఘటనలో ఇరు పక్షాలకు చెందిన 26 మంది గాయపడగా, అందులో ఆరుగురు పోలీసులు, 20 మంది ఖైదీలు వున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.