: రాష్ట్రపతి వద్దకు ‘ఫిరాయింపు’ల ఫిర్యాదు...సాయంత్రం ప్రణబ్ తో టీ టీడీపీ నేతల భేటీ
తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీల మధ్య ఎడతెగని వివాదంలా మారిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడప తొక్కనుంది. ఈ మేరకు నేటి సాయంత్రం హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ను కలవనున్న టీ టీడీపీ నేతలు, తెలంగాణలో అధికార పార్టీ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతితో భేటీకి టీటీడీపీ నేతలకు ఇప్పటికే అపాయింట్ మెంట్ కూడా లభించింది. తమ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లో చేరడంతో పాటు మంత్రి పదవి కూడా చేపట్టడం చట్టవిరుద్ధమని టీటీడీపీ నేతలు వాదిస్తున్నారు. తమ పార్టీ టికెట్ పై గెలిచిన తలసాని చేత ముందూ వెనుకా చూసుకోకుండా గవర్నర్ కూడా మంత్రిగా ప్రమాణం చేయించారని టీటీడీపీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.