: పురుష అధ్యాపకుల ఏకాగ్రత దెబ్బతింటోందంటూ అమ్మాయిల స్కర్ట్ లను నిషేధించిన బ్రిటన్ విద్యాసంస్థ
9, 10, 11 తరగతులు చదువుతున్న అమ్మాయిలు వేసుకుంటున్న పొట్టి స్కర్టులు పురుష ఉపాధ్యాయుల ఏకాగ్రతను దెబ్బ తీస్తున్నాయంటూ... స్కర్టులపై నిషేధం విధించిందో విద్యా సంస్థ. యూకేలోని స్టాఫోర్డ్ షైర్ లో ఉన్న 'రొవెనా బ్లెంకోవే ఆఫ్ ట్రెంథామ్ హైస్కూల్' యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పబ్లిసిటీ కోసం తాము ఈ నిర్ణయం తీసుకోలేదని... కేవలం ఇబ్బందుల్ని తొలగించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యాసంవత్సరం పెరిగే కొద్దీ స్కర్టులు పొట్టివి అవుతున్నాయని... స్కర్టుల పొడవు పెంచుకోవాలని అమ్మాయిల తల్లిదండ్రులకు తాము చెబుతున్నప్పటికీ, చాలామంది పట్టించుకోవడం లేదని చెప్పారు. పొట్టి స్కర్టు వేసుకుని మెట్లమీద నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు అధ్యాపకులతో పాటు, తోటి విద్యార్థులకు కూడా ఏకాగ్రత దెబ్బతింటోందని ప్రిన్సిపల్ తెలిపారు. అమ్మాయిల స్కర్టులు కేవలం వారి బాటమ్ ను మాత్రమే కవర్ చేసేలా ఉన్నాయని... ఈ పరిస్థితుల్లో స్కర్ట్ లను నిషేధించడం మినహా తమకు మరో దారి లేదని స్పష్టం చేశారు. ఈ సెప్టెంబర్ నుంచి అమ్మాయిలు కూడా విధిగా ట్రౌజర్లను ధరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మరోవైపు, హెర్ట్ ఫోర్డ షైర్ లో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ 'సెయింట్ మార్గరెట్ స్కూల్' కూడా ఇప్పటికే స్కర్ట్ లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.