: రాజ్యాంగాన్ని కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారు: మర్రి శశిధర్ రెడ్డి


టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో గవర్నర్ నరసింహన్ తన విధులను సరిగా నిర్వర్తించలేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారని, వెంటనే ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు రాసిన లేఖలో మర్రి ఈ మేరకు పేర్కొన్నారు. టీడీపీ సభ్యుడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారని, ఈ క్రమంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 2(1) అంశాన్ని గవర్నర్ ఉల్లంఘించారని వివరించారు. సభ్యుడు కానటువంటి వ్యక్తిని ఆరు నెలలకు మించి కొనసాగించడం రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తలసానిని వెంటనే తొలగించేలా గవర్నర్ ను కేంద్రం ఆదేశించాలని లేఖలో కోరారు. తలసాని విషయంలో ప్రభుత్వానిదే తప్పని మొదట అనుకున్నానని, కానీ మొత్తం ఎపిసోడ్ లో గవర్నర్ దే బాధ్యత అని తెలుస్తోందని మర్రి తెలిపారు. దాంతో ఫార్టీ ఫిరాయింపులను గవర్నర్ చర్య ప్రోత్సహించినట్లయిందన్నారు. గవర్నర్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని రాజ్ నాథ్ కు తెలిపారు.

  • Loading...

More Telugu News