: దావూద్ వస్తే అరెస్టు చేయకుండా ఊరుకుంటామా?: శరద్ పవార్
అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం భారత్ కు రావడానికి సిద్ధంగా వున్నట్టు ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ తనకు చెప్పినట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ధ్రువీకరించారు. ముంబై పేలుళ్ల ఘటనలో భారత న్యాయస్థానం ఎదుట హాజరయ్యే విషయంలో సంప్రదింపులు జరిపేందుకు బ్రిటన్ లో దావూద్ తనను కలిసినట్టు రాం జెఠ్మలానీ తెలిపారని ఆయన చెప్పారు. విచారణ నిమిత్తం న్యాయస్థానానికి వచ్చినప్పుడు దావూద్ ను అరెస్టు చేయకూడదని ఆయన ప్రతిపాదించారని పవార్ వెల్లడించారు. అయితే హంతకుడిని శిక్షించకుండా ఎలా ఉంటాం? దావూద్ భారత్ వస్తే కచ్చితంగా అరెస్టు చేస్తామని జెఠ్మలానీకి స్పష్టం చేసినట్టు పవార్ తెలిపారు. జెఠ్మలానీ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని, అందుకే దానిని తిరస్కరించామని పవార్ చెప్పారు. కాగా, ముంబై పేలుళ్ల ఘటన సంభవించినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్ పవార్ ఉన్నారు.