: గుంటూరులో ఏపీ టీడీపీ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాన్నే రాష్ట్ర టీడీపీ కార్యాలయంగా మార్చబోతున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే కొన్నిరోజులుగా ఇరురాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తడం, అలాగే ఏపీలోని 13 జిల్లాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వారి పనులకోసం హైదరాబాద్ కు రావడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేయాలని, నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇందులో భాగంగా పార్టీ వాస్తు సిద్ధాంతి రాఘవతో పాటు లోకేష్, చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఇటీవల గుంటూరు కార్యాలయాన్ని పరిశీలించి వెళ్లారట. ఈ నెలాఖరులోగా జిల్లా ఆఫీసులో పార్టీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.