: వివాదాస్పద నేత జీవిత చరిత్రపై సినిమా
భారతీయ సినీ రంగంలో జీవిత చరిత్రల యుగం నడుస్తున్నట్టుంది. జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మిల్ఖా సింగ్, మేరీ కోం జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని సినిమాలు రూపొందుతున్నాయి కూడాను. తాజాగా, వివాదాస్పద రాజకీయ నాయకుడుగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ జీవిత చరిత్రపై సినిమా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిన్న వయసులోనే ఆయన ఉన్నత రాజకీయనాయకుడిగా ఎదిగిన వైనం, ఇందిరాగాంధీ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలలో ఆయన ప్రమేయం వంటి అంశాలను ఈ చిత్రం స్పృశిస్తుందని అంటున్నారు. హన్సల్ మెహతా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కంగనా రనౌత్ తో 'సిమ్రన్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇది పూర్తికాగానే సంజయ్ గాంధీ సినిమా మొదలు పెడతానని ఆయన వెల్లడించారు.