: కొత్త విద్యలు నేర్చుకుంటున్న గంభీర్
టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకునేందుకు గౌతమ్ గంభీర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బ్యాటింగ్ తీరును మెరుగుపర్చుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లి క్రికెట్ దిగ్గజం జస్టిన్ లాంగర్ పర్యవేక్షణలో సాధన చేస్తున్న ఈ ఢిల్లీ క్రికెటర్... ఇప్పుడు కొత్త విద్యలు నేర్చుకుంటున్నాడు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నాడు. గౌతీ ఇవి నేర్చుకుంటోంది క్రికెట్ సాధన నుంచి రిలాక్సేషన్ కోసం కాదట. తన బ్యాటింగ్ టెక్నిక్ కు పదునుపెట్టుకునేందుకు ఈ కొత్త విద్యల బాట పట్టాడట. జిమ్నాస్టిక్స్ ద్వారా వ్యక్తుల ఫుట్ వర్క్ మెరుగవ్వడమే గాక, శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం వీలవుతుంది. ఇక, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ శరీర కదలికల్లో చురుకుదనానికి తోడ్పడతాయి. ముఖ్యంగా, ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు బ్యాట్స్ మెన్ కు సరైన ఫుట్ వర్క్, చురుకైన కదలికలు ఎంతో అవసరం. పెర్త్ లో శిక్షణ పొందుతున్న గంభీర్ ఇప్పుడు లాంగర్ సలహాతోనే ఈ కొత్త విద్యలు నేర్చుకుంటున్నాడట.