: ఒబామా రాక కోసం నాయనమ్మ ఎదురుచూపులు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరలోనే కెన్యాలో పర్యటించనున్నారు. ఒబామా తండ్రి స్వదేశం కెన్యానే అన్న సంగతి తెలిసిందే. కాగా, ఒబామాకు వరుసకు నాయనమ్మ అయ్యే మమా సారా అనే ఆవిడ కెన్యాలోనే ఉంది. ఆమె ఒబామా తాత హుస్సేన్ ఒన్యాంగోకు మూడో భార్య. రక్తసంబంధం లేకపోయినా ఒబామా ఆమెను "బామ్మా" అని నోరారా పిలుస్తాడట. ఇప్పుడామె మనవడి రాక కోసం ఎదురుచూస్తోంది. ఒబామా వస్తే అతడి కోసం ఏమేం వంటకాలు సిద్ధం చేయాలో ఇప్పటినుంచే ప్లాన్ చేస్తోంది. కెన్యా సంప్రదాయ వంటకాలన్నీ తయారు చేస్తానని చెబుతోంది. చేపలు, చికెన్, మొక్కజొన్న అంబలి... ఇలా పెద్ద లిస్టే రూపొందించిందీ వృద్ధురాలు. "ఒబామా సెనేటర్ అయితేనేమి? ప్రెసిడెంట్ అయితేనేమి? నేను అతని కోసం ఏం వండానో అవన్నీ తింటాడు" అని పేర్కొంది. కోగెలో ప్రాంతానికి వెళ్లి పూర్వీకులకు నివాళి అర్పించమని ఒబామాకు చెప్పానని, అయితే, అతను రాజధాని నైరోబి వెలుపలి ప్రాంతాలకు వెళతాడో లేదో స్పష్టత లేదని సారా తెలిపింది.