: భారత్ లో హెలికాప్టర్ల తయారీకి మహీంద్రా గ్రూప్ తో చేతులు కలిపిన ఎయిర్ బస్
ప్రపంచంలో పేరెన్నికగన్న విమాన తయారీదారు ఎయిర్ బస్ భారత్ కు చెందిన మహీంద్రా గ్రూప్ తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు ఓ జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేసి, భారత్ లో హెలికాప్టర్లు తయారు చేయనున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు పెట్టుబడి వివరాలు తెలియరాలేదు. ఈ హెలికాప్టర్లను సైనికావసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తారు. గస్తీ, నిఘా హెలికాప్టర్లు, నావికాదళంలో భిన్న పాత్రలు పోషించే హెలికాప్టర్లకు సంబంధించి తమ జాయింట్ వెంచర్ ఆర్డర్లు దక్కించుకుంటుందని భావిస్తున్నామని ఎయిర్ బస్ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ ఎస్పీ శుక్లా మాట్లాడుతూ... "సంయుక్తంగా మేం ఉత్పత్తి చేయబోయే భారత్ నెక్ట్స్ జనరేషన్ హెలికాప్టర్లు దేశీయ రక్షణ రంగ అవసరాలను తీర్చడమే కాదు, మున్ముందు ఎగుమతుల పరంగానూ సత్తా నిరూపించుకుంటాయి" అని పేర్కొన్నారు.