: గ్రీస్, ప్యూర్టో రికోల సరసన చైనా!
దివాలా తీసిన దేశంగా నిలిచిన గ్రీస్, అదే దారిలో నడుస్తున్న వార్తలతో ప్యూర్టో రికోలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లను నట్టేట ముంచి, గత వారం పది రోజులుగా పత్రికల హెడ్ లైన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే. అవే దేశాల జాబితాలో ఇప్పుడు చైనా చేరింది. గ్రీస్, ప్యూర్టో రికోలతో పోలిస్తే అమెరికన్ ఇన్వెస్టర్లు చైనాలో జరుగుతున్న మార్కెట్ పతనం చూసి భయాందోళనలు చెందుతున్నారు. చైనాలో మార్కెట్ల పనితీరును యూఎస్ ప్రముఖ మనీ మేనేజర్లుగా పేరు తెచ్చుకున్న జెఫ్రీ గుండాల్చ్, బిల్ గ్రాస్, డాన్ ఇవాసిన్, మొహమ్మద్ ఎల్ ఇరియన్ం డేవిడ్ రోసెన్ బర్గ్ తదితరులు నిశితంగా పరిశీలిస్తున్నారు. చైనా మార్కెట్లో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడిని ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యతలను పక్కన బెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్ నుంచి ఈ సంవత్సరం జూన్ 12 మధ్య 110 శాతం పెరిగిన సూచికలు, అప్పటి నుంచి నేటి వరకూ సుమారు 30 శాతం పతనమయ్యాయి. ఏప్రిల్ తరువాత షాంగై ప్రధాన సూచిక తొలిసారిగా 4 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. "చైనాలో జరుగుతున్న పతనాన్ని గురించి మేము చర్చించాం. ఆ దేశ మార్కెట్లో పెరుగుతున్న రిస్క్ పై ఓ కన్నేసి వుంచాం" అని ఫండ్స్ మేనేజింగ్ సంస్థ 'పిమ్కో' చీఫ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆఫీసర్ డాన్ ఇవాసిన్ వ్యాఖ్యానించారు. జెఫ్రీ గుండాల్చ్ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గత కొన్నేళ్లుగా షాంగై సూచిక కదలికలను పరిశీలించి అందుకు అనుగుణంగా అమెరికా నాస్ డాక్ సూచిక కదలికలు నమోదవుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పరిస్థితులు చక్కబడే వరకూ చైనా మార్కెట్ కు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.