: స్వచ్ఛ భారత్ కు ప్రచారకర్త అవకాశాన్ని తిరస్కరించాలనుకుంటున్న ధోనీ!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆయా రాష్ట్రాల వారీగా పలువురు సెలబ్రిటీలు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి ప్రచారకర్తగా ఉండాలని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని గత నెలలో ఆ రాష్ట్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి అమరేంద్ర ప్రతాప్ సింగ్ కోరారట. ఆ సమయంలో ధోనీ తన నిర్ణయాన్ని చెప్పలేదట. కానీ ఆ అవకాశాన్ని ధోనీ తిరస్కరించాలనుకుంటున్నట్టు తాజాగా కుటుంబసభ్యులు ఒకరు వెల్లడించారు. అంతేగాక జార్ఖండ్ పర్యాటక శాఖ ప్రచారకర్త అవకాశాన్ని కూడా తిరస్కరించాలని ధోనీ అనుకుంటున్నాడట. ఇప్పటికే రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ, పల్స్ పోలియో, అక్షరాస్యత తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున ధోనీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, ఆయా పథకాలకు లభిస్తున్న ఆదరణ అంతంతమాత్రమేనని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ధోనీ కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే రాంచీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమని కావచ్చని అంటున్నారు.