: విమానం ఆలస్యానికి నేను కారణం కాదు... తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఇండియా వచ్చాక దావా వేస్తా: సీఎం ఫడ్నవిస్
ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంగా బయల్దేరడానికి తాను కారణం అంటూ కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మండిపడ్డారు. విమానం ఆలస్యంగా బయల్దేరడానికి తాను కారణం కాదని... తాను నిర్ణీత సమయానికే విమానం ఎక్కానని... అందరిలాగేనే తాను కూడా విమానం ఎప్పుడు బయల్దేరుతుందా? అని ఎదురు చూశానని ట్విట్టర్లో తెలిపారు. ఇండియాకు తిరిగి వచ్చాక తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. మరోవైపు, విమానంలో ఉన్న తోటి ప్రయాణికుల్లో ఇద్దరు ఫడ్నవిస్ కు మద్దతుగా నిలిచారు. విమానం ఆలస్యానికి ఫడ్నవిస్ కారణం కాదని... తన బృందంతో కలసి ఆయన సరైన సమయానికే విమానం ఎక్కారని... ఇమిగ్రేషన్ సమస్యల కారణంగానే విమానం ఆలస్యంగా బయల్దేరిందని వారు చెప్పారు.