: కాందహార్ హైజాకర్లను మట్టుబెట్టేందుకు పక్కాగా స్కెచ్ వేసినప్పటికీ... ఉన్నతాధికారులు 'నో' చెప్పారట... నగ్న సత్యాలను వెల్లడిస్తున్న పుస్తకం


1999లో ఖాట్మండూ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని పాక్ ప్రేరేపిత 'హర్కతుల్ ముజాహిదీన్' ఉగ్రవాదులు హైజాక్ చేసి, ఆఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ కు తీసుకెళ్లిన ఘటనను ఎవరూ మర్చిపోలేరు. అయితే, ఈ హైజాక్ జరిగిన సమయంలో చోటు చేసుకున్న దారుణ ఘటనలను 'కాశ్మీర్: ది వాజ్ పేయి ఇయర్స్' అనే పుస్తకం వెలుగులోకి తెచ్చింది. హైజాక్ ఘటన జరిగిన సమయంలో 'రా' (రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) చీఫ్ గా ఉన్న ఏఎస్ దౌతల్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో ఆయన మాటల తూటాలను పేల్చారు. హైజాక్ ఘటనను కళ్లకు కట్టినట్టు వివరించారు. "వాస్తవానికి ఖాట్మండూ నుంచి బయల్దేరిన కాసేపటికే విమానం హైజాక్ కు గురైందన్న సంగతి తెలిసింది. ఇంధనాన్ని నింపుకోవడానికి విమానం కాసేపు అమృత్ సర్ విమానాశ్రయంలో ఆగింది. ఈ లోపలే ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పంజాబ్ పోలీస్ చీఫ్ పక్కాగా స్కెచ్ వేశారు. నిష్ణాతులైన కమెండోలను కూడా రంగంలోకి దించారు. ఢిల్లీలో కూర్చొని వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు 'ఓకే' అంటే ఆపరేషన్ స్టార్ట్ అయిపోయేది. కానీ, ఉన్నతాధికారుల బృందం 'నో' చెప్పింది. ఇది జరిగిన కాసేపటికే ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా విమానాన్ని తొలుత లాహోర్ కు... ఆ తర్వాత అక్కడ నుంచి కాందహార్ కు తరలించారు. 'జైష్-ఏ-మహమ్మద్' వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజహర్ సహా మరో ఇద్దరు అగ్రనాయకుల విడుదలకు డిమాండ్ చేసి... వారిని విడిపించుకుపోయారు" అంటూ ఆనాటి విమాన హైజాక్ వివరాలను కళ్లకు కట్టినట్టుగా వెల్లడించింది ఈ పుస్తకం. సంక్షోభాన్ని నివారించడానికి ఏర్పాటైన ఉన్నతాధికారుల బృందం ఒకర్నొకరు దూషించుకోవడంతోనే సరిపోయిందని... సమస్యను పరిష్కరించడానికి వారు చిన్నపాటి ప్రయత్నం కూడా చేయలేదని ఏఎస్ దౌలత్ ఆరోపించారు. అధికారుల నిర్వాకంతో విమాన హైజాకర్ల ముందు మనం దద్దమ్మలమైపోయామని ఆయన వాపోయారు. అయితే అందుకు బాధ్యులైన అధికారుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News