: చంద్రబాబుకు స్వర పరీక్ష?... సన్నాహాలు చేస్తున్న తెలంగాణ ఏసీబీ!
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచేలాగే కనిపిస్తోంది. ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా పరిగణిస్తున్న ఆడియో, వీడియో టేపులు, ఫోన్ సంభాషణలపై విశ్లేషణను పూర్తి చేసిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నిన్న తన తుది నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. సదరు నివేదిక కాపీ తమకు కావాలని నిన్ననే ఏసీబీ అధికారులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదిక కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నామని చెప్పిన ఏసీబీ అధికారులు, సదరు నివేదికతో కేసు దర్యాప్తులో వేగం పుంజుకుంటుందని తమ పిటీషన్ లో కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారని భావిస్తున్న ఏసీబీ అధికారులు, చంద్రబాబు గొంతును మరోమారు పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా చంద్రబాబుకు స్వర పరీక్ష చేయక తప్పదని కూడా ఆ శాఖ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే ఈ విషయంలో చంద్రబాబుకు నేరుగా నోటీసులు జారీ చేయాలా? లేక కోర్టు ద్వారా అనుమతి తీసుకోవాలా? అన్న విషయంపై ఏసీబీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.