: రేవంత్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా?... సుప్రీం సీజే విచారణపై ఉత్కంఠ!


ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో నేడు జరగనున్న విచారణ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డితో పాటు సహ నిందితులు సెబాస్టియన్, ఉదయసింహలు బెయిల్ పై మొన్న సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో ఇంటికి చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర మంత్రులపైనా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెనువెంటనే సదరు వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో, వీడియో సీడీలతో తెలంగాణ ఏసీబీ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి బయట ఉంటే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలగడం ఖాయమని, వెంటనే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని ఏసీబీ దేశ సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టులో నిన్న ఉదయమే పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు నేడు విచారించనున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించనుంది. మార్నింగ్ సెషన్ లోనే త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా? లేక ఏసీబీ పిటీషన్ కు చుక్కెదురవుతుందా? అన్న విషయాలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News