: బీజేపీ నేతల నిర్వాకానికి క్షమాపణలు చెప్పిన అశోక్ గజపతిరాజు
బీజేపీ నేతాశ్రీల నిర్వాకానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు క్షమాపణలు చెప్పారు. నిన్న విదేశీ పర్యటనకు వెళ్లిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాశ్మీర్ వెళ్లిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్వాకం కారణంగా ఎయిరిండియా విమానాలు సుమారు గంటసేపు ఆలస్యంగా నడిచాయి. దీంతో వారి సహప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఢిల్లీలో మాట్లాడుతూ, ప్రజల్లోకి వెళ్లిన సమాచారం ప్రకారం చూస్తే, ఈ అంశం ప్రతివాదనకు తావులేనిదని అన్నారు. మంత్రుల నిర్వాకం వల్ల ఎవరెవరికి ఇబ్బంది కలిగిందో వారందరికీ మంత్రిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అసలు జరిగిందేమిటో తెలుసుకుంటామని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దీనిపై పీఎంవో వివరణ అడిగిందని ఆయన వెల్లడించారు.