: ఓ చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకుని మరో చేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు!


ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్ మ్యాచ్ లు చూసినవారు అతడి బ్యాటింగ్ విన్యాసాలను అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఈ ఆసీస్ యువ క్రికెటర్ ఫీల్డింగ్ లోనూ దిట్టే. తాజాగా, ఇంగ్లాండ్ గడ్డపై ఓ అద్భుత క్యాచ్ అందుకుని వార్తల్లోకెక్కాడు. లీడ్స్ ప్రాంతంలోని బార్డ్స్ లే కీస్విక్ లేన్ మైదానంలో కౌంటీ చాంపియన్ యార్క్ షైర్, స్థానిక బార్డ్స్ లే క్లబ్ జట్ల మధ్య ఛారిటీ మ్యాచ్ జరిగింది. ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా మ్యాక్స్ వెల్ ఎండ వేడిమి తట్టుకోలేక ఓ 'కార్నెటో ఐస్ క్రీమ్' అందుకున్నాడు. అది తింటున్నంతలో బ్యాట్స్ మన్ ఎడ్ క్లేటన్ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. అది కాస్తా మ్యాక్స్ వెల్ దిశగా వచ్చింది. అయితే, బౌండరీ వద్ద ఉన్న ఈ కంగారూ క్రికెటర్ హైరానా పడకుండా, చేతిలో ఐస్ క్రీమ్ ను అలాగే పట్టుకుని, మరో చేత్తో బంతిని క్యాచ్ చేశాడు. క్యాచ్ పట్టడం పూర్తయ్యాక, మళ్లీ ఐస్ క్రీమ్ పనిబట్టడంలో మునిగిపోయాడు. ఇక, అవుటైన బ్యాట్స్ మన్ క్లేటన్ పెవిలియన్ కు వెళుతూ, బాగా క్యాచ్ పట్టావంటూ మ్యాక్స్ వెల్ ను అభినందించడం విశేషం.

  • Loading...

More Telugu News