: తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఘనంగా ఇస్తాం: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం పవిత్ర రంజాన్ వేడుకను ఘనంగా నిర్వహించనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8న నిజాం కాలేజ్ వేదికగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గోవాలని వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లను ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాదులోని మరో వంద మసీదుల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని ఓ మసీదులో వెయ్యి మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అందుకు 26 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. లక్షా తొంభై ఐదు వేల మంది నిరుపేద ముస్లింలకు 500 రూపాయల విలువ చేసే దుస్తులు ఉచితంగా ఇవ్వనున్నామని ఆయన ప్రకటించారు. ఈ దుస్తులను మసీదుల్లోని ఇమాంలు పేద ముస్లింలకు అందజేస్తారని ఆయన చెప్పారు. అదే రోజు మసీదుల వద్ద భోజనాలు ఏర్పాటు చేస్తారని అన్నారు. రంజాన్ శుభసందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 5001 మసీదుల్లోని ఇమాం, మౌజన్ లకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున జీవన భృతి ఇస్తామని ఆయన తెలిపారు. ఈ బట్టల పంపిణీకి 9.75 కోట్ల రూపాయలు, భోజనాలకు 4 కోట్ల రూపాయలు, మసీదుల్లోని ఇమాం, మౌజన్ ల జీతాలకు నెలకు కోటి చొప్పున ఏడాదికి పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఆయన తెలిపారు. రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ వేడుకల కార్యక్రమాన్ని రూపొందిస్తుందని ఆయన చెప్పారు. ఆ రోజున 21 లక్షలు ఖర్చు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనాధ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.