: మదర్సాలు ప్రాథమిక విద్యను బోధించడం లేదు: 'మహా' సర్కారు
మహారాష్ట్రలో ఉన్న మదర్సాలపై అక్కడి సర్కారు దృష్టి సారించింది. ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టులను బోధించని మదర్సాలకు గుర్తింపు ఉపసంహరించాలని నిర్ణయించింది. ఆ సబ్జెక్టులు బోధించని మదర్సాలను పాఠశాలలుగా పేర్కొనలేమని, వాటిలో ప్రాథమిక విద్యను బోధిస్తున్నట్టు కనిపించడం లేదని పేర్కొంది. ఈ క్రమంలో జులై 4న రాష్ట్రంలో ఉన్న అన్ని మదర్సాలను పరిశీలించాలని నిర్ణయించింది. అధికారిక గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో 1,889 మదర్సాలు ఉండగా, వాటిలో 1.48 లక్షల మందికి పైగా చిన్నారులు ఉన్నారు. మదర్సాలలో ఇంగ్లీషు, గణితం, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టుల బోధన తప్పనిసరి చేయాలని 'మహా' సర్కారు కిందటి నెలలో నిర్ణయించింది. ఈ సబ్జెక్టులను బోధించని మదర్సాలకు నిధులు అందించబోమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఏక్ నాథ్ ఖాడ్సే స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మదర్సాకు ఏడాదికి రూ.5.50 లక్షల చొప్పున నిధులు ఇస్తోంది.