: హతవిధీ... డిగ్గీరాజా లవర్ ని ఆయన కూతురనుకుని పొరపాటుపడ్డారు!
'సెల్ఫీ విత్ డాటర్'... ప్రధాని మోదీ చేపట్టిన సరికొత్త ప్రయోగం. కూతురుతో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. మోదీ ఇచ్చిన ఈ పిలుపుకు దేశవ్యాప్తంగా మంచి ప్రతిస్పందన లభించింది. అయితే... ఊహించని విధంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి డిగ్గీరాజాను మాత్రం ఇరుకున పెట్టింది. వివరాల్లోకి వెళ్తే... అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ డిగ్గీ రాజా తన ప్రేయసితో కలసి తీసుకున్న సెల్ఫీని... 'సెల్ఫీ విత్ డాటర్' విభాగంలో చేర్చేసింది. దాన్ని కనిపెట్టిన ఓ వ్యక్తి... జరిగిన పొరపాటును ట్వీట్ చేశారు. మోదీ చేపట్టిన కార్యక్రమాన్ని డిగ్గీరాజా తప్పుగా అర్థం చేసుకున్నారని... సెల్ఫీ విత్ డాటర్ అని మోదీ అన్నారని, సెల్పీ విత్ గర్ల్ ఫ్రెండ్ అనలేదని కొంతమంది జోకేశారు. మోదీ పిలుపు మేరకు ఎంతో మంది తండ్రులు తమ కూతుళ్లతో కలసి సెల్ఫీలు తీసుకున్నారనే నేపథ్యంలో, న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో భాగంగా తన జర్నలిస్టు ప్రియురాలితో డిగ్గీ రాజా కలసి ఉన్న ఫొటోను కూడా ప్రచురించి, పప్పులో కాలేసింది. డెబ్బై ఏళ్లకు దగ్గర్లో ఉన్న దిగ్విజయ్ సింగ్ నలభయ్యో పడిలో ఉన్న అమృతా రాయ్ అనే జర్నలిస్టుతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు విహాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరూ కలసి దిగిన రొమాంటిక్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.