: రేవంత్ బెయిల్ పై రేపు సుప్రీం విచారణ... మళ్లీ ఉత్కంఠకు తెర లేపిన టీ ఏసీబీ
ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టు గడప తొక్కింది. కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి సహా, మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహల బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటీషన్ ను రేపు విచారించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున రేవంత్ రెడ్డి బెయిల్ పై బయట ఉంటే, సాక్షులను ప్రభావితం చేస్తారని ఏసీబీ అధికారులు తమ పిటీషన్ లో కోర్టుకు విన్నవించారు. అంతేకాక ఈ కేసులో ప్రధాన సాక్ష్యాలైన ఆడియో, వీడియో టేపులపై ఫొరెన్సిక్ నివేదికను విచారణ కోర్టు (ఏసీబీ న్యాయస్థానం) పరిశీలించాల్సి ఉందని కూడా తెలిపారు. నెల రోజుల పాటు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డికి కింది కోర్టు విధించిన ఏసీబీ కస్టడీ, కుమార్తె ఎంగేజ్ మెంట్ నేపథ్యంలో తాత్కాలిక బెయిల్ తదితర అంశాలతో నిత్యం తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రాజ్యమేలింది. అయితే రేవంత్ కు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ తో ఉత్కంఠకు తెరపడినట్లేనని అంతా భావించారు. అయితే సుప్రీంకోర్టులో ఏసీబీ పిటీషన్ తో మరికొంతకాలం పాటు తెలుగు ప్రజలకు అదే ఉత్కంఠ తప్పేలా లేదు.