: కేంద్రం రూ. 1.3 లక్షల కోట్లంటే, రూ. 4.5 లక్షల కోట్లు వస్తున్నాయి!
డిజిటల్ ఇండియా (డీఐ) ప్రధాని నరేంద్ర మోదీ మరో కలల ప్రాజెక్టు. గ్రామీణ భారతావనిని డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యంతో సమీప భవిష్యత్తులో రూ. 1.13 లక్షల కోట్ల వ్యయ ప్రణాళికతో చేపట్టిన బృహత్తర కార్యక్రమం. డీఐ ప్రాజెక్టుకు నిన్న అంకురార్పణ జరగగా, భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఏకంగా రూ. 4.5 లక్షల కోట్లను పెట్టుబడిగా పెడతామని ప్రతిజ్ఞ చేశాయి. టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, బిర్లా గ్రూప్ సంస్థల సీఎండీ కుమార మంగళం బిర్లా, భారతీ ఎంటర్ ప్రైజస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తదితరులు ఒకవైపు మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ, తాము సైతం భారీ ఎత్తున పెట్టుబడులతో కలసి వస్తామని తెలిపారు. నిన్నటి డీఐ ప్రారంభోత్సవ సభలో ముఖేష్ అంబానీ ప్రసంగిస్తూ, తమ సంస్థ వివిధ రకాల డిజిటల్ సేవలను ప్రజలకు దగ్గర చేసే నిమిత్తం రూ. 2.5 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనుందని వివరించారు. వచ్చే ఐదేళ్లలో రూ. 1 లక్ష కోట్లను డిజిటల్ ఇండియాలో భాగంగా ఇన్వెస్ట్ చేయనున్నామని సునీల్ భారతీ మిట్టల్ వెల్లడించగా, టెలికం రంగంలో వేగవంతతమైన సమాచార బట్వాడా కోసం రూ. 10 వేల కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్టు అనిల్ అగర్వాల్ తెలిపారు. సుామరు 50 వేల మందికి ఉపాధిని అందించేలా రూ. 40 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎల్సీడీ తయారీ కేంద్రాన్ని నిర్మించనున్నట్టు వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇలా వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు మోదీ నిర్ణయాలకు మద్దతు పలకడంతో డీఐ తొలి అడుగు విజయవంతంగా పడ్డట్లయింది.