: అమర్ నాథ్ యాత్రపై ఏ క్షణమైనా ఆత్మాహుతి దాడి!
నిన్న మొదలైన అమర్ నాథ్ యాత్రపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరపడానికి ప్లాన్ రూపొందించారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. యాత్రికుల భద్రత దిశగా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం, కేంద్రం పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఐబీ వర్గాలు సూచించాయి. సుమారు 10 నుంచి 15 మంది లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్ లోకి వచ్చినట్టు సమాచారం ఉందని, వీరు భక్తుల రూపంలో వచ్చి ఏ క్షణమైనా దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వీరు తొలుత టెలికం టవర్లను ధ్వంసం చేసి సమాచార వ్యవస్థలను నాశనం చేయవచ్చని కూడా సమాచారం ఉందని తెలిపారు. కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ స్వయంగా యాత్రకు బయలుదేరడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు సైన్యం, ఇటు జమ్మూ పోలీసులు కాపు కాస్తున్నారు. ఈ దఫా యాత్ర 59 రోజులు సాగనుంది. పవిత్ర హిమాలయాల్లో స్వయంభువుగా అవతరించే మంచు రూప శివలింగాన్ని దర్శించుకోవడం ద్వారా ముక్తి లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం.