: అమెరికాలో బాలయ్య... నాట్స్ వేడుకలకు సతీసమేతంగా హాజరు
టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమెరికా పర్యటనకు వెళ్లారు. భార్య వసుంధరతో కలిసి ఆయన నిన్న అమెరికాలోని లాస్ ఏంజెలిస్ చేరుకున్నారు. నాట్స్(నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన బాలయ్య దంపతులకు అక్కడ ఘన స్వాగతం లభించింది. నాట్స్ ప్రతినిధులు మన్నవ మోహనకృష్ణ, ఏ.శ్రీధర్ ల నేతృత్వంలో అక్కడి తెలుగు ప్రజలు బాలయ్య దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలయ్య ఆటోగ్రాఫ్ ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇదిలా ఉంటే, మూడు రోజుల పాటు అంగరంగవైభవంగా జరగనున్న నాట్స్ మహాసభలకు తెలుగు నేల నుంచి దాదాపు 10 వేల మందికి ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ తారలు కాజల్ అగర్వాల్, తనికెళ్ల భరణి, కమలిని ముఖర్జీ, నిషా అగర్వాల్, అలీ, బుల్లితెర నటి శ్యామల, గజల్ శ్రీనివాస్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. ‘తరతరాల అమరావతి’ పేరిట రూపొందించిన నాటిక అక్కడి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వేడుకల్లో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్) జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోనున్నారు.