: మందులోకి సోడా పోసేవాళ్లంతా మంత్రులయ్యారు: రేవంత్
రాష్ట్రంలో టీడీపీని అంతం చేస్తానన్న వ్యక్తి పావురాల గుట్టలో కలిసిపోయాడని, తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేస్తామని కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారని, టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కుట్రపూరితంగా తనను జైలుకు పంపాడని అన్నారు. తనను జైలుకు పంపేందుకు అధికార యంత్రాంగాన్ని వినియోగించుకున్నారని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే కేసీఆర్, ఏబీఎన్, టీవీ 9 గొంతు నొక్కిన సంగతి మర్చిపోయాడా? అని నిలదీశారు. తన సొంత ఛానెల్ ని ఆయుధంగా చేసుకుని విమర్శలు చేస్తూ, అవాకులు, చవాకులు ప్రసారం చేయలేదా? అని అడిగారు. ఈ సన్నాసులంతా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారని, తాగుబోతోడి పక్కన చేరి నాటకాలాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మందులోకి సోడా పోసినోళ్లంతా మంత్రులయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.