: ఆప్యాయతకు కరిగి కన్నీరైన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు


ముక్కూముఖం తెలియని వారు ఆప్యాయత కురిపిస్తే స్పందించడానికి మాటలు సరిపోవు. అలాంటి సంఘటనే ఓ వ్యక్తి జీవితంలో చోటుచేసుకుంది. జేన్ అంటిన్ అనే స్వీడిష్ వ్యక్తికి కొన్ని రోజుల క్రితం ఎయిడ్స్ వ్యాధి సోకింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల సమాజంలో చాలా నిర్లక్ష్యం ఉంటుందని విన్న ఆయన, తనకు ఎయిడ్స్ సోకిందని తెలిస్తే ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని భావించాడు. దీంతో తాను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడినని, తనను ఎవరైనా ముట్టుకోవచ్చని రెండు ప్లకార్డులపై రాసి పక్కన పెట్టి రద్దీగా ఉన్న వీధిలో నిలుచున్నాడు. తొలుత ఆయనను ఆశ్చర్యంగా చూసి తప్పుకున్న జనం, నెమ్మదిగా ఆయనను ముట్టుకునేందుకు ఆసక్తి చూపారు. కొంత మంది ఆయనను ఆలింగనం చేసుకుని తమకే భేదభావం లేదని చాటారు. దీంతో అంటిన్ కరిగి కన్నీరైపోయాడు. తానెవరో తెలియకపోయినా, నడివీధిలో చాలా మంది చూపిన ఆప్యాయత తనకు శక్తినిచ్చిందని పేర్కొన్నాడు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ఆప్ లోడ్ చేయగా, దానికి విపరీతమైన లైక్ లు వచ్చాయి.

  • Loading...

More Telugu News