: రాష్ట్రపతితో సెక్షన్ 8పై గవర్నర్, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?: బొత్స
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసిన సమయంలో గవర్నర్, చంద్రబాబు సెక్షన్ 8పై చర్చించారా? అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏపీ సీఎం, మంత్రులు ప్రతిరోజూ ఈ అంశంపై మాట్లాడుతున్నారని అలాంటప్పుడు రాష్ట్రపతి వద్ద ప్రస్తావించాలి కదా? అని అడిగారు. దానికి సంబంధించి ఏ పత్రికలోనూ వార్తలు రాలేదన్నారు. చంద్రబాబు, ఆయన సన్నిహితులు ఇచ్చిన లీక్ లలో కూడా ఈ విషయం గురించి ఎక్కడా లేదన్నారు. అంటే వారు సెక్షన్ 8పై రాష్ట్రపతి వద్ద మాట్లాడలేదనే అనుకోవాల్సి ఉంటుందని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎదురుదాడి చేశారు. రాష్ట్రపతి ఇంకా ఇక్కడే ఉన్నారు కాబట్టి సెక్షన్ 8పై ఇప్పుడైనా అడగాలని డిమాండ్ చేశారు. మాటల చాతుర్యంతో రోజూ మాట్లాడితే ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.