: బలవంతంగా నవ్వాల్సి వస్తోంది: రాజమౌళి
విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ సినిమా 'బాహుబలి' గురించి దర్శకుడు రాజమౌళి ఓ వార్తా చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. చిత్రంలో కథంతా బాహుబలి పాత్ర చుట్టూనే తిరుగుతుందని చెప్పారు. సినిమాలోని పాత్రలకు బాహుబలి పాత్రతో సంబంధం ఉంటుందని, ఆ పాత్రకు ప్రభాస్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని తెలిపారు. తెలుగులో ఈ సినిమా రూ.100 కోట్ల రికార్డు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబ్బులు మిగుల్చుకోవడానికి ఈ సినిమా చేయలేదని స్పష్టం చేశారు. ఇక, సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్నకొద్దీ టెన్షన్ పెరిగిపోతోందని, లోపలి ఒత్తిళ్లను కవర్ చేసుకోవడానికి బలవంతంగా నవ్వాల్సి వస్తోందని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. చిత్ర సమర్పకుడు రాఘవేంద్రరావు తమపై బరువు మోపారని రాజమౌళి అన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన ఒక్క ఫ్రేమును కూడా చూడలేదని, దాంతో తనపై మరింత ఒత్తిడి నెలకొందని వివరించారు.