: నట్టేట ముంచుతున్న సామాజిక మాధ్యమాలు!


ఫేస్ బుక్, ట్విట్టర్ లేదా యూట్యూబ్ లేకుంటే మరోటి... సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రచారం మొదలైతే అది హల్ చల్ చేస్తుంది. నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అత్యంత వేగవంతమైన సమాచార బట్వాడా దీనిలో లాభమైతే, చాలా సందర్భాల్లో వ్యక్తులు, సంస్థల తప్పు లేకుండానే ఇమేజ్ లేదా బ్రాండ్ విలువ నట్టేట మునుగుతోంది. తెలిసిన సమాచారాన్ని త్వరగా నలుగురితో పంచుకోవాలన్న ఉత్సుకతే ఇందుకు కారణం. ఉదాహరణకు ఇటీవల వచ్చిన కేఎఫ్ సీ 'ఎలుక' ఉదంతాన్నే తీసుకుంటే, డివోరైజ్ డిక్సన్ అనే అమెరికా పౌరుడు కాలిఫోర్నియాలోని కేఎఫ్ సీ ఔట్ లెట్లో తాను చికెన్ కొంటే ఎలుక మాంసం వచ్చిందని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టాడు. ఇది విశ్వవ్యాప్తం అయింది. ఈ ఘటన జూన్ 12న జరుగగా, అది ఎలుక కాదు, చికెనే అని డీఎన్ఏ రిపోర్టు వచ్చి అది బహిర్గతమయ్యేలోగా కేఎఫ్ సీ బ్రాండ్ విలువకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ ఒక్క ఉదంతంలో సంస్థ అమ్మకాలు 20 శాతం వరకూ తగ్గాయి. అది ఆదాయం, నికర లాభాలపై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పక్కర్లేదు. మరో ఉదాహరణగా మదర్ డైరీలో సబ్బుల అవశేషాలు ఉన్నాయని యూపీఎఫ్ డీఏ (ఉత్తరప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. ఈ ఘటన జూన్ 16న జరుగగా, మదర్ డైరీ ఎండీ నాగరాజన్ తక్షణం స్పందించారు. సంస్థకు పెను నష్టం జరిగేలోపే వివరణ ఇచ్చారు. యూపీఎఫ్ డీఏ నివేదిక తప్పని సాక్ష్యాలను ముందుంచారు. తమ ఉత్పత్తులు సురక్షితమని చెప్పి నెటిజన్లను ఒప్పించగలిగారు. దీంతో ఆ సంస్థపై అనుచిత ప్రచారం ఆగిపోయింది. ఇక మ్యాగీ విషయంలో సోషల్ మీడియాలో జరిగిన యాగీ అంతాఇంతా కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. మ్యాగీపై ట్వీట్ల వరద, వేసుకున్న జోకులు అందరమూ చూశాం. మ్యాగీ అమ్మకాలు ఆగినందుకుగాను ఆ సంస్థకు కలిగిన నష్టం రూ. 2,300 కోట్లకు పైగానే. ఏదైనా సంస్థకు, లేదా వ్యక్తి గౌరవాలకు భంగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంటే... 1. తక్షణం స్పందించాలి. 2. తప్పుంటే ఒప్పుకోవాలి లేదా సరైన వివరణ ఇవ్వాలి 3. ఎదురుదాడి చేసినా, రక్షణాత్మక ధోరణిలో ఉన్నా ఏదో ఒక సమాచారం ఇస్తుండాలి 4. తప్పు ఇతరులపై నెట్టే ప్రయత్నం వద్దు 5. సమాచారాన్ని వేగంగా ప్రజల్లోకి చేర్చేందుకు లాయల్ కస్టమర్ల మద్దతు తీసుకోవాలి. 6. ఓ కంపెనీకి నష్టం జరుగుతుంటే కింది స్థాయి వ్యక్తులు కాకుండా టాప్ మేనేజ్ మెంట్ కల్పించుకుంటే త్వరలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. 7. సంప్రదాయ పద్ధతుల్లో పత్రికా ప్రకటన విడుదల చేసి కూర్చుంటే నష్టమే అధికం 8. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని 24 గంటలూ కనిపెట్టి వాటికి తగ్గ సమాధానాలు సాధ్యమైనంత త్వరగా ఇస్తే మంచిది.

  • Loading...

More Telugu News