: తిరుపతికి తరలిన గవర్నర్, ఏపీ సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు
నేటి మధ్యాహ్నం నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుపతి, తిరుమల పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్ లు ఈ ఉదయం తిరుపతి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి తిరుమల శ్రీవారి దర్శనానికి రానుండడంతో ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వీరు స్వాగతం పలకనున్నారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా తిరుపతి పయనమై వెళ్లారు. కాగా, ఉదయం 10:45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ప్రణబ్ తొలుత తిరుచానూరు వెళ్లనున్నారు. అక్కడ జరిగే కుంకుమపూజలో పాల్గొంటారు. ఆపై కపిలతీర్థం దర్శించి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. కాసేపు పద్మావతి అతిథి గృహంలో సేదదీరి 1:15 గంటల సమయంలో స్వామివారిని దర్శించుకుంటారు. ప్రణబ్ ముఖర్జీ దర్శనానికి ఏర్పాట్ల కోసం మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వదర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఈలోగానే కల్యాణోత్సవ భక్తులను మండపానికి తరలిస్తారు. తిరిగి 1:30 గంటల తరువాతనే సర్వదర్శనాన్ని పునరుద్ధరిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమయ్యే ప్రణబ్ 6:30 గంటలకు బొల్లారం చేరుకుంటారని తెలుస్తోంది. ఒకేసారి పలువురు వీఐపీలు తిరుపతి, తిరుమలకు వస్తుండడంతో రేణిగుంట నుంచి తిరుమల వరకూ 250 మంది భద్రతా దళ సిబ్బందిని అదనంగా నియమించారు.