: ఇంత అవమానమా?... సోనియాకు డీఎస్ ఘాటు లేఖ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి.శ్రీనివాస్ ఆ పార్టీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోయినా, తనలోని అసంతృప్తిని వెళ్లగక్కుతూ, సోనియా గాంధీకి ఘాటైన లేఖను ఆయన రాశారు. తాను పార్టీకి ఆది నుంచి అంకితభావంతో సేవలందించానని, తనకెంతో అన్యాయం జరిగిందని వాపోయారు. 2004లో తనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, ఆపై చిన్నచూపు చూశారని ఆరోపించారు. కేవలం మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఎమ్మెల్సీగా మాత్రమే ఎంపిక చేశారని వాపోయారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ తనకు మంత్రి పదవిని ఇవ్వలేదని ఆరోపించారు. ఇటీవల తనకు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందన్న ప్రచారం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, తనకు మరో అవకాశం ఇవ్వడం లేదన్న విషయాన్ని తెలపలేదని, కనీసం తనను పిలిచి కూడా మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్ లో బీసీ నేతలకు జరుగుతున్న అన్యాయం, అవమానాలపై కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందని వివరించారు.