: నరసింహన్ ఇచ్చిన విందులో నోరూరిస్తూ, ఘుమఘుమలాడిన వంటకాలివే!
హైదరాబాదు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం నిన్న రాత్రి గవర్నర్ ఇచ్చిన విందులో తెలంగాణ వంటకాలు ఘుమఘుమలాడాయి. రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో విందు ఏర్పాట్లు చేశారు. వీనులకు విందైన హిందుస్థానీ సంగీత వాయిద్యం నేపథ్యంగా విందు సాగింది. వివిధ రకాల కూరగాయలతో వెజ్ బిర్యాని, పనస బిర్యానిలతో పాటు చింత చిగురు పప్పు, దక్కన్ సాస్, జొన్న రొట్టెలు, పెసర పునుకుల పులుసు, మిర్చి, వంకాయ చారు, పచ్చి పులుసు, మొక్కజొన్న వడ వంటి వంటకాలను అతిథుల కోసం గవర్నర్ వండించారు. రాష్ట్రపతి ప్రణబ్ కు గవర్నర్ దంపతులు స్వయంగా వడ్డించారు. భోజనం అనంతరం వంటలు చాలా బాగున్నాయని ప్రణబ్ గవర్నరును అభినందించారు. విందు అనంతరం ఆహూతులతో రాష్ట్రపతి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులు ప్రణబ్ ముఖర్జీకి వెండి వీణను బహూకరించారు.