: రేవంత్ కు బెయిలెలా వచ్చిందంటే...!
ఓటుకు నోటు కేసులో నిన్న తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి బెయిలు లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ తరపున వాదించిన న్యాయవాదులు సరిగ్గా తమ వాదనలు వినిపించడంలో విఫలమైనందునే బెయిలు లభించేందుకు మార్గం సుగమమైందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితులు బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారన్నది ఏసీబీ తొలి వాదన. దీన్ని కోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఎదుట ఫిర్యాదిదారుల స్టేట్ మెంటును రికార్డు చేసి సీల్ చేసిన తరువాత వారు సాక్ష్యాన్ని ఎలా మారుస్తారని కోర్టు ప్రశ్నించింది. ఆపై పటిష్ఠమైన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు న్యాయస్థానం ఎదుట ఉండగా, వాటినెలా మారుస్తారని కూడా ఏసీబీని అడిగింది. నాలుగో ముద్దాయిని విచారించాల్సి వుందని, ఆయన పారిపోయాడని ఏసీబీ చేసిన వాదననూ కోర్టు తిరస్కరించింది. నాలుగో ముద్దాయి కోర్టును ఆశ్రయించాడని గుర్తు చేసిన న్యాయస్థానం, ఆయన పారిపోయాడన్న అభిప్రాయానికి రాలేమని తేల్చి చెప్పింది. మరో అంశంగా 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చాల్సి వుందని చేసిన వాదనను తోసిపుచ్చుతూ, ఆ విషయం తేల్చాల్సింది విచారణ సంఘాలేనని, నిందితులతో ఇక అవసరమేంటని ప్రశ్నించింది. ఇలా ఏసీబీ చేసిన ప్రతివాదనతోనూ ఏకీభవించని న్యాయస్థానం రేవంత్ కు బెయిలిచ్చింది.