: తగ్గిపోతున్న ఐటి ఉద్యోగాలు
'మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు?' 'సాఫ్ట్ వేర్ ఇంజనీర్' 'మా పాప కూడా క్యాంపస్ లోనే టిసిఎస్ కు సెలక్ట్ అయింది'... ఇలా సాఫ్ట్ వేర్ కొలువులతో మురిసిపోతున్న వారికి ముందున్నది ముసళ్ల పండగ అన్నట్లు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దేశీయ ఐటి కంపెనీల రాబడులు తగ్గుతూ వస్తుండడంతో కంపెనీలు కూడా తమ రూట్ మారుస్తున్నాయి. ఫలితంగా గతంలోలా ఐటి ఉద్యోగ నియామకాల సందడి ఇప్పుడు కనిపించడం లేదు.
ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం ఐటి కంపెనీలపై భారీగానే పడింది. వాటి రాబడులు తగ్గుతున్నాయి. అదే సమయంలో వ్యయాలు పెరుగుతున్నాయి. ఫలితంగా ఖర్చులను తగ్గించుకోవడం కోసం కంపెనీలు కొత్త మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇన్నాళ్లూ ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇచ్చిన ప్రాధాన్యతను పక్కనబెట్టి ఇప్పుడు సైన్స్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. కారణం, వీరు తక్కువ వేతనాలకే అందుబాటులో ఉండడం. అదే సమయంలో కంపెనీలు చైనా, ఫిలిప్పీన్స్ తదితర ఖర్చు తక్కువ మార్కెట్లకు తమ కార్యకలాపాలను విస్తరించుకుంటున్నాయి. భారత్ కంటే ఆయా దేశాలలో వ్యయాలు తక్కువగా ఉండడంతో దేశీయ ఐటి కంపెనీలు అటువైపు వెళుతున్నాయి. ఇవన్నీ కలిసి ఐటి ఉద్యోగ నియామకాలను తగ్గించేస్తున్నాయి.
2011-12లో ఇన్ఫోసిస్ 19వేల మంది ఇంజనీర్లకు కొలువులు ఇచ్చింది. 2012-13లో అది కాస్తా 7వేలకు పడిపోయింది. టిసిఎస్ గత ఆర్థిక సంవత్సరం 60వేల మందిని నియమించుకోగా.. ఈ ఏడాది 45వేల మందినే నియమించుకోవాలని లక్ష్యాన్ని తగ్గించుకుంది. ఇక విప్రో 2011-12లో 13535మందికి ఉద్యోగాలివ్వగా అది 2012-13లో 9800కు తగ్గిపోయింది. హెస్ సిఎల్ టెక్నాలజీ కూడా 2012-13లో కేవలం 1900 మందిని మాత్రమే నియమించుకుంది. అది 2011-12లో 5వేలకు పైగా ఉండడం గమనార్హం. మరి ఏటా దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది నుంచి పదిలక్షల మంది ఇంజనీరింగ్ నిపుణులు బయటకు వస్తున్నారు. భవిష్యత్తులో వీరికి వేరే ఉద్యోగాలే దిక్కు!