: టికెట్ లేకుండా ప్రయాణించే వారిని అడ్డుకోవడం ఎలా?... పరిష్కార మార్గాలు తెలపండంటున్న రైల్వే మంత్రి
దేశంలో టికెట్ లేకుండా ప్రయాణించే వారి కారణంగా ఎంతో నష్టపోతున్నామన్న విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఐఐటీలు, నేషనల్ లా యూనివర్శిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టికెట్ లేకుండా జరిపే ప్రయాణాలను అరికట్టేందుకు కచ్చితమైన విధానంతో ముందుకు రావాలని సదస్సుకు హాజరైన యువతను కోరారు. "టికెట్ రహిత ప్రయాణాలను నిర్మూలించవచ్చు, అయితే, అదెలాగన్నదే తెలియడంలేదు. ఈ సమస్యకు మీరు పరిష్కారం చూపండి" అని పిలుపునిచ్చారు. మిగతా రవాణా వ్యవస్థలతో పోల్చితే రైలు టికెట్ చాలా చవక అని, అందుకే, టికెట్ లేకుండా జరిపే ప్రయాణాలను అనుమతించలేమని స్పష్టం చేశారు. అత్యుత్తమ ఐడియాతో ముందుకు వచ్చిన వారికి రైల్వే శాఖ బహుమతి ఇస్తుందని తెలిపారు.