: రేవంత్ రెడ్డి నేటి రాత్రికి చర్లపల్లి జైల్లోనే... విడుదల ఇక రేపే!
అంతా భావించినట్టు టీడీపీ నేత రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి నేడు విడుదల కాలేదు. బెయిల్ మంజూరు కావడంతో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ కాపీలను రేవంత్ తరపు లాయర్లు ఏసీబీ కోర్టుకు అందించారు. ఏసీబీ న్యాయస్థానానికి రేవంత్ తరపు న్యాయవాదులు ష్యూరిటీలు కూడా సమర్పించారు. ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన రిలీజ్ ఆర్డర్లను చర్లపల్లి జైల్లో సమర్పిస్తే కానీ రేవంత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రిలీజ్ ఆర్డర్ లో టైపింగ్ మిస్టేక్ లు, టెక్నికల్ మిస్టేక్స్ చోటు చేసుకోవడంతో ష్యూరిటీల సమర్పణలో ఆలస్యం జరిగింది. దీంతో, రేవంత్ రెడ్డి రిలీజ్ ఆర్డర్ జారీలో జాప్యం చోటుకుంది. సమయాభావం కారణంగా రేవంత్ రెడ్డి రేపు ఉదయం చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. దీంతో, రేవంత్ రెడ్డికి భారీ ఎత్తున స్వాగతం పలకాలని భావించిన టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. రేవంత్ రెడ్డిని వేధించేందుకే ఆలస్యం జరిగిందని పార్టీ కార్యకర్తలు ఆరోపించినప్పటికీ, న్యాయస్థానం నిబంధనలు అనుసరించాలని నేతలు సర్దిచెప్పారు. దీంతో మరో రాత్రి రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులోనే గడపనున్నారు.