: రేవంత్ రిలీజ్ పై తీవ్ర ఉత్కంఠ
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి ఈ రోజు విడుదల అవుతారా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. కాసేపటి క్రితం ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ కాపీలను రేవంత్ తరపు లాయర్లు అందించారు. దీంతోపాటు, షూరిటీలు కూడా సమర్పించారు. ఇక్కడ నుంచి రిలీజ్ ఆర్డర్లు తీసుకుని చర్లపల్లి జైల్లో సమర్పించాల్సి ఉంది. సాయంత్రం 7 లోగా చర్లపల్లి జైలుకు రిలీజ్ ఆర్డర్లు అందితేనే రేవంత్ నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. లేకపోతే, రేవంత్ మరో రాత్రి జైల్లోనే గడపాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ మధ్యాహ్నమే హైకోర్టు ఆర్డర్ కాపీలు ఏసీబీ కోర్టుకు అందాయి. అయితే, కాపీలో టైపింగ్ మిస్టేక్ లు, టెక్నికల్ మిస్టేక్ లు ఉండటంతో వాటిని వెనక్కు తిప్పి పంపారు. దీంతో, రిలీజ్ ఆర్డర్ జారీలో జాప్యం చోటుకుంది. ఈ నేపథ్యంలో, రేవంత్ విడుదలపై టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చర్లపల్లి జైలు వద్దకు భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు.