: జైలుకు వెళ్లినంత మాత్రాన వెనక్కు తగ్గినట్టు కాదు: రేవంత్ సతీమణి గీత
అసంఖ్యాకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, మిత్రులు చేసిన ప్రార్థనల వల్లే తన భర్త రేవంత్ రెడ్డికి బెయిలు లభించిందని, ఇందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని రేవంత్ రెడ్డి సతీమణి గీత వ్యాఖ్యానించారు. రేవంత్ కు హైకోర్టు బెయిలు మంజూరు చేసిన తరువాత ఆమె ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. జైలుకు వెళ్లినంత మాత్రాన ఆయన వెనక్కు తగ్గుతారని అనుకోవద్దని, ఆయన గతంలో లాగానే రాజకీయాల్లో దూసుకెళ్తారని అన్నారు. బెయిలు వచ్చినట్టుగానే కేసుల నుంచి కూడా బయటపడతారని భావిస్తున్నట్టు తెలిపారు. ఇంతకాలం రాజకీయంగా మాత్రమే తన భర్తను వేధిస్తున్నారని భావిస్తూ వచ్చామని, వ్యక్తిగతంగా ఇలాంటి కేసుల్లో ఇరికిస్తారని ఊహించలేదని ఆమె అన్నారు. ఇకపై జరిగే పరిణామాలు ఎలాంటివైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. తన భర్తకు పూర్తి మద్దతు తెలిపేందుకు ఎంతో మంది వచ్చారని తెలిపారు. ఎవరికైనా దెబ్బలు తగిలితేనే రాటుదేలుతారని వ్యాఖ్యానించిన గీత, ఇంత ధైర్యంగా నిలబడతానని తాను అనుకోలేదని, మానసికంగా కొంత ఇబ్బందిపడ్డా, పార్టీ, కార్యకర్తలు ఇచ్చిన మనోధైర్యంతో నిలదొక్కుకున్నానని తెలిపారు. తన వైవాహిక జీవితంలో ఇన్ని రోజుల పాటు ఆయన్ను వదిలి వుండలేదని తెలిపారు. కొడంగల్ లో ఉండాలని కోర్టు చెప్పడం తమకు ఆనందమేనని, కార్యకర్తలు ఇక్కడికి వచ్చి కలిసే బదులు తామే వారివద్దకు వెళ్తామని అన్నారు. రేవంత్ అరెస్టయిన రోజే టీడీపీ అధినేత చంద్రబాబు తమకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. మొత్తం ఉదంతం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని మరింతగా పెంచిందని గీత వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసే పోరాటం కొనసాగుతుందని, ఆయన ఎప్పటిలాగానే ప్రజా సమస్యలపై పోరాడుతారని, వెనక్కి తగ్గబోరని స్పష్టం చేశారు.