: ఒక్క ఫోన్ కొడితే చాలు, వీధుల్లోకి వస్తానంటున్న కుష్బు
ఏదైనా సమస్యపై పోరాటం చేయాలని భావించేవారు తనకు ఒక్క ఫోన్ కొడితే, తాను స్వయంగా వచ్చి వీధి పోరాటాలు చేస్తానని తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు పిలుపునిచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల ఎంపిక కోసం సమావేశం జరిగింది. పలువురు సీనియర్ మహిళలు ఈ పదవి కోసం పోటీ పడ్డారు. కుష్బు మాత్రం తనదైన శైలిలో ప్రసంగించి కాంగ్రెస్ కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న తనను ప్రతి చోటకు ఆహ్వానించే అవకాశం, అధికారిక కార్యకర్తలకు ఉందని కుష్బు వ్యాఖ్యానించారు. ఇంటి పక్క సమస్యైనా, నియోజకవర్గ సమస్యైనా పోరాటం చేయాల్సి వస్తే తన వద్దకు నేరుగా రావాల్సిన అవసరం లేదని, ఒక్క ఫోన్ చేస్తే చాలని, ప్రజల కోసం శ్రమించేందుకు, ఉద్యమాలు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళా అధ్యక్షురాలి పదవికి ప్రజాకర్షణ కల్గిన నేతను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ఏఐసీసీ ఉండగా, ఇందుకు అన్ని రకాల అర్హతలు సినీ నటి కుష్బుకు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో ఆమె నియామకం దాదాపు ఖరారైనట్టేనని సమాచారం.