: అలాంటి వ్యక్తి కోసం వెదికితే లాంగర్ కనిపించాడు: గంభీర్
టీమిండియాలో చాన్నాళ్ల క్రితమే చోటు కోల్పోయిన గౌతమ్ గంభీర్ పునరాగమనం చేసేందుకు తహతహలాడుతున్నాడు. ఒకప్పటి ఫామ్ ను అందిపుచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం గౌతీ ఆస్ట్రేలియాలోని పెర్త్ లో సాధన చేస్తున్నాడు. బ్యాటింగ్ ను మెరుగుపర్చుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ఈ ఢిల్లీ స్టార్ కంగారూ బ్యాటింగ్ దిగ్గజం జస్టిన్ లాంగర్ పర్యవేక్షణలో ఆటతీరుకు మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఈ సందర్భంగా గంభీర్ మీడియాతో మాట్లాడుతూ... "నా కోచ్ పార్థసారథి శర్మ మృతి తర్వాత నా బ్యాటింగ్ శైలిని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి కోసం అన్వేషించాను. జస్టిన్ లాంగర్ అందుకు తగిన వ్యక్తి అని అర్థమైంది. అందుకే పెర్త్ వచ్చాను. లాంగర్ కెరీర్ ను చాలా దగ్గర నుంచి పరిశీలించాను. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఎంతో జాగ్రత్తగా మలుచుకున్నాడు తన కెరీర్ ను. కిందటేడాది చాంపియన్స్ లీగ్ సందర్భంగా లాంగర్ పెర్త్ స్కార్చర్స్ జట్టు తరపున భారత్ వచ్చాడు. అప్పుడే ఈ విషయం చర్చించాను" అని వివరించాడు.